పట్టణ ప్రగతిని మెరిపించడమే లక్ష్యం
– పారిశుద్ధ్యం, హరితహారానికి పెద్దపీట
– పట్టణంలో వీధి కుక్కల బెడద నియంత్రణకు కృషి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త
– ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ ప్రగతితో తాండూరును మెరిపిద్దామని మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్తా అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ నూతన భవనంలో చైర్ పర్సన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యవసర కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగింది. సమావేశం అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన ఎజెండా అంశాలను వివరించారు. వచ్చేనెలలో నిర్వహించే పట్టణ ప్రగతి విజయవంతానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ ముళ్ల పొదలు, మురుగుకాలువల పరిశుభ్రం, అందుకు కావాల్సిన యంత్రాలు, కూలీల గురించి చర్చించడం జరిగిందన్నారు.
దీంతో పాటు హరిత హారంలో బాధ్యతగా మొక్కలు నాటబడం, ట్రీగాడ్స్ ఏర్పాటు చేసే సంరక్షించాలని సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి వి జయవంతానికి అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు అందరు సహకరించాలని కోరారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో పెరుగుతున్న వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే ఏజెన్సీ ద్వారా ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు తాండూరులో జోరుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై కూడ చర్చించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సమావేశంలో పలువురు కౌన్సిలర్లు వారి వార్డుల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకవచ్చినట్లు ఆయా వార్డుల కౌన్సిలర్లు తెలిపారు. పట్టణంలో ని గ్రీన్ సిటీ కాలనీలో కబ్జాకు గురవుతున్న చిలుకవాగును కాపాడాలని కోరినట్లు కాంగ్రెస్ ఫ్లోర్ లీకర్ వరాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో తాండూరు ఆర్డీటు ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్లు శోభారాణి, సిందూజ గౌడ్, సాజిద్ అలీ, సోమశేఖర్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, విజయాదేవి, లతాగౌడ్, మంకాల రాఘవేందర్, ప్రవీణ్ గౌడ్, బోయరవి, రాము, వెంకన్నగౌడ్, అస్లాం, భీంసింగ్, ముక్తార్, సాహు శ్రీలత, సంగీత ఠాకూర్, బంటారం లావణ్య, బాలప్ప, ప్రబాకర్ గౌడ్, బోంబీనా, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, వెంకట్రామ్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

