తెలంగాణ కంది సీడ్స్ రెడీ..!
– వ్యవసాయ పరిశోధన స్థానంలో పంపిణీకి సిద్దం
– కంది సాగులో అధిక దిగుబడులకు అవకాశం
– సద్వినియోగం చేసుకోవాలి : శాస్త్రవేత్త డా.సుధారాణి
తాండూరు, దర్శిని ప్రతినిధి: నకిలీ విత్తనాల నుంచి రైతులకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో తాండూరులోని ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో తెలంగాణ సీడ్స్ పేరుతో కంది విత్తనాలను రెడీ చేసింది. మంగళవారం నుంచి పరిశోధన స్థానంలో వీటీ విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి యేడాది మే 24న రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్రంగా విత్తనాల వేళ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి తాండూరులో కొత్తగా మంగళవారం విత్తనాల మేళా నిర్వహిస్తుంది. ఇదే కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ కంది-3(టీడీఆర్‌జీ-59), హనుమ (టీడీఆర్‌జీ-4), ఆశ రకాల విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం, తాండూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి. సుధారాణి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.
పరిశోధన స్థానంలో రూపొందించిన ఈ కంది విత్తనాలతో సాగులో అధిక దిగుబడులను అందిస్తుందని ఆమె తెలిపారు. రేగడి పొలంలో సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు. 165-175 రోజుల కాలంలో పంట చేతికొస్తుందని అన్నారు. ఎండు తెగులు, గొడ్డు తెగులు, పచ్చ పురుగును సమర్థవంతంగా తట్టుకుంటుందని తెలిపారు. నూతన పద్దతులను ఆచరిస్తే 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడుని ఇస్తుందని తెలిపారు. రైతులు పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంచిన విత్తనాలను సొంతం చేసుకుని అధిగ దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.

