కోడంగల్‌కు రేవంత్ రెడ్డి చేసిందేమి లేదు
– టీఆర్ఎస్లోనే కోడంగల్‌కు కొత్త రూపురేఖలు
– త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల నీళ్లు
– త్వరలో కోస్గిలో ఆసుపత్రి ప్రారంభం
– రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి హరీష్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికాబాద్ జిల్లాలోని కోడంగల్ నియోజకవర్గానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిందేమి లేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్తరూపు సంతరించుకున్నదని పేర్కొన్నారు. గురువారం కోడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పట్టణంలో డిగ్రీ కళాశాల, 50 పడకల ఆసుపత్రి భవనం, డయాలిస్ సెంటర్, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలో మంత్రి హరీష్ రావు ముఖయ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప.. అభివృద్ధి మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. ఎనిమిదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఈ నియోజకవర్గానికి ఒక హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, బస్ డిపో ఎందుకు తేలేకపోయారని హరీశ్‌రావు ప్రశ్నించారు. అదేవిధంగా వికారాబాద్, నారాయణ్‌పేట్ జిల్లాల్లో మొత్తం రూ. 42.34 కోట్లతో 6 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 8 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. కోస్గి ఆస్పత్రిని రెండు నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కోరిక మేరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచి, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామన్నారు. కొడంగల్‌లోనూ డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గానికి రేపోమాపో పాలమూరు ఎత్తిపోతల నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగుతామన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నారు. అయినా పనులు ఆగవని తేల్చిచెప్పారు. త్వరలోనే కొడంగల్‌కు సాగునీరు తీసుకొస్తామని స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ తాగునీటి సమస్య ఉండే.. మిషన్ భగీరథతో ఆ సమస్యను పరిష్కరించామని చెప్పారు.



