చల్లారిన అగ్నిపథ్
– పరిస్థితిని కుదుట చేసిన పోలీసులు
– అదుపులోకి ఆందోళన కారులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కొనసాగిన ఆందోళనలు అదుపులోకి వచ్చాయి. దాదాపు 9గంటల తరువాత రణరంగంగా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శాంతియువత వాతావరణం నెలకొంది. ఉదయం ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్మీ నియామక అధికారి వద్దకు ఇద్దరిని తీసుకెళ్తామని ఆందోళనకారులకు నచ్చజెప్పినా వారు శాంతించలేదు. తాము చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని, ఆర్మీ ఉద్యోగ నియామక అధికారి తమవద్దకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో ఉదయం నుంచి వేచి చూసిన పోలీసులు సాయంత్రం 6గంటల సమయంలో ఒక్కసారిగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వందలాదిమంది పోలీసులు చేరుకోవడంతో ఆందోళనకారులు తలోదిక్కు వెళ్లిపోయారు. ఎట్టకేలకు పరిస్థితి కుదుట పడింది. భారీగా మోహరించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, రాష్ట్ర పోలీసు బలగాలు ఆందోళనకారులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నాయి. ప్లాట్ ఫాం ఒకటి నుంచి 10 వరకు పట్టాలపై బైఠాయించిన నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు.
సేవల పునరుద్దరణ
ఆందోళనల నేపథ్యంలో రద్దు చేసిన మెట్రో రైళ్లను సాయంత్రం 6.30 గంటల తర్వాత పునరుద్ధరించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల పునరుద్ధరణ కొనసాగుతోందని స్టేషన్ డైరెక్టర్ టి.ప్రభు చరణ్ తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత కాచిగూడ నుంచి బయలుదేరాల్సిన చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, మైసూర్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి, విశాఖ వెళ్లాల్సిన రైళ్లు బయలుదేరాయని వెల్లడించారు. సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు చెప్పారు. మరికొద్ది సేపట్లో తిరుపతి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా బయలుదేరుతుందని తెలిపారు.



