గ్రామాల అభివృద్ధి బాధ్యత మాదే..!
– ప్రజల మద్య ఉండి సమస్యలను తీర్చడమే ధ్యేయం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
-తాండూరు మండలంలో కొనసాగిన పల్లెపల్లెకు ఎమ్మెల్సీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికలు ఉన్నా లేకున్నా గ్రామాల అభివృద్ధి బాధ్యత మాపై ఉందని, ప్రజల మద్య ఉండి సనుస్యలను పరిష్కరించడమే ధ్యేయమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పల్లెపల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమం తాండూరు మండలంలోని ఎల్మకన్నె చెన్‌గేష్‌పూర్ గ్రామాలలో కొనసాగింది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఎల్మకన్నెలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎల్మకన్నె, చెన్‌గేష్ పూర్ గ్రామాలలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. గురుకుల పాఠశాలలు, రోడ్లు, బ్రిడ్జీలు మంజూరు చేయించి అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా ప్రజా క్షేత్రంలో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటామన్నామని అన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్సీ, జెడ్సీ నిధులతో వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని ప్రజలకు హామి ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, అర్హులకు ఆసరా ఫించన్లు, పెండ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తుందని, ప్రజలు సీఎం సర్కారుకు అండగా ఉండాలన్నారు. మరొ వైపు చెన్ గేష్ పూర్‌లో సర్పంచ్ రామమ్మను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, సర్పంచులు మేఘనాథ్ గౌడ్, కృష్ణ, శ్రీ శైలం గౌడ్, నాయకులు కేశవరావు, శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటేశం, రాజేందర్ రెడ్డి, రాంచంద్రారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేష్, హరిశ్వర్ రెడ్డి, రాములు, ఉపసర్పంచ్ పార్వత మ్మ, శ్రీనివాస్ రెడ్డి, రాజుగౌడ్, రమేష్ గౌడ్, బాస్కర్ గౌడ్, గుండప్ప తదితరులు పాల్గొన్నారు.



