కార్మికుల వెతలు పట్టించుకోరా
– ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలు చెల్లించండి
– సీఐటీయూ నాయకుల డిమాండ్
– బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయం ముందు దర్నా
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: పంచాయతీ కార్మికుల వెతలను పట్టించుకుని వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులతో కలిసి దర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులకు నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు వేతనాలను నెలనెలా లక్షల చొప్పున పెంచి కార్మికుల వేతనాల చెల్లించకుండా వివక్ష చేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఐటీయూసీ, గ్రామపంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శ్యామప్ప, లక్ష్మి, శ్యామల, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



