రోడ్డు ప్రమాదాలకు చెక్..!
– శివాజీ చౌక్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
– బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శివాజీ చౌక్ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. చౌరస్తాలో వాహనాల రాకపోకల వేగనియంత్రణకు ఆంక్షలు విధించారు. ఇందుకోసం బారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. అసలు పోలీసులు ఈ చర్యలు ఎందుకు తీసుకున్నారంటే.. తాండూరు – చించొల్లి రోడ్డు జాతీయ రోడ్డుకు లింకు రోడ్డుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాగ్నా నది నుంచి తాండూరు మండలం గౌతాపూర్ వరకు ఇటీవలే రోడ్డు మరమ్మత్తులు పూర్తయ్యాయి. దీంతో శివాజీ చౌరస్తా మీదుగా వాహనాల రాకపోకలు అధికం కావడంతో పాటు వేగంగా వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రాకపోకలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఈక్రమంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని శివాజీ చౌరస్తాలో భారీ కేడ్లను ఏర్పాటు చేసి చౌరస్తాను పూర్తిగా మూసివేశారు. పోలీసులు చేపట్టిన చర్యలపై పట్టణ వాసులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


