దసరాకు విధ్వంసానికి ప్లాన్
– ఉగ్రమూకల గుట్టు రట్టు చేసిన పోలీసులు
– ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు కుట్ర
– ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు అరెస్టు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రమూకలు చేపట్టిన పన్నాగానికి పోలీసులు కళ్లెం వేశారు. ఐఎస్ఐ వేసుకున్న భారీ కుట్రను నిఘావర్గాల సమాచారంతో భగ్నం చేశారు. అంతేకాకుండా దసరా సంబరాలను లక్ష్యంగా చేసుకుని ప్లాన్ వేసిన ప్రధాన కుట్రదారున్ని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ అంతా ఆదివారం అర్దరాత్రికి ముందు జరిగింది. వివరాల్లోకి వెళితే.. మూసారంబాగ్‌లో ఉంటోన్న ప్రధాన కుట్రదారు జాహిద్ పాకిస్తాన్ ఏజెంట్స్‌కు పనిచేస్తున్నాడు. ఇటీవలే వారి నుంచి నుంచి నాలుగు గ్రెనేడ్స్‌తోపాటు పేలుడు సామగ్రి, నగదును తీసుకున్నట్లు నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దంతో పోలీసులు జాహిద్ ఇంటిపై దాడులు నిర్వహించగా గ్రానేడ్స్‌తో పాటు రూ.5.41లక్షల క్యాష్‌ని స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా జాహిద్‌కు పలు టెర్రర్ గ్రూప్స్‌తో లింకులున్నట్లు.. పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు గుర్తించింది సిట్. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని ఐఎస్‌ఐ నుంచి ఆదేశాలు అందుకున్న జాహిద్, ఈ దసరా సెలబ్రేషన్స్ లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు ఇంటరాగేషన్‌లో నిర్దారించింది. బాంబు పేలుళ్లతోపాటు RSS, BJP లీడర్స్‌ను అంతమొందించేందుకు, మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర చేసినట్టు గుర్తించారు.
పాత కేసుల్లో నిందితుడు జాహిద్
ప్రధాన కుట్రదారు జాహిద్, పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. 2002లో దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా టెంపుల్ బ్లాస్ట్ కేసులో… 2004లో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ బ్లాస్ట్ కుట్ర కేసులో… 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌పై సూసైడ్ అటాక్ ప్లాన్ కేసులో అక్యూజ్డ్‌గా ఉన్నాడు జాహిద్. అలాగే, మక్కా మసీద్ బ్లాస్ట్ కేసులోనూ గతంలో జాహిద్‌ను ఇంటరాగేట్ చేశారు పోలీసులు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై పన్నాగం
లేటెస్ట్‌గా ఉగ్ర దాడుల కోసం టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు జాహిద్. అందుకోసం ఉగ్రభావాలున్న యువకులను రిక్రూట్ చేసుకున్నాడు.
ప్రధాన నిందితుడు అబ్దుల్ జాహెద్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాలతో సంబంధాలున్నాయి. నగరంలో బాంబుపేలుళ్లతో అలజడి సృష్టించాలని ఐఎస్‌ఐ ఆదేశించడంతో నిందితులు ముగ్గురూ ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్, భాజపా సమావేశాలు, ఊరేగింపులు, దసరా పండగ, భక్తులు గుమిగూడే ప్రాంతాలు గుర్తించి రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. పథకం అమలుకు యువకులను సమకూర్చుకునే పనిలో జాహెద్ నిమగ్నమయ్యాడు. పాత నేరస్థులు, సామాజిక మాధ్యమాలు, నిద్రాణబృందాల (స్లీపర్‌సెల్స్)పై నిఘా ఉంచిన పోలీసులు ఉగ్రవాదుల కుట్రను పసిగట్టారు. ఇప్పటివరకు ఆరుగురిని తన టీమ్‌కి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం మెయిన్ అక్యూజ్డ్ జాహిద్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల వెర్షన్ ఇలాగుంటే, అసలు తమ పిల్లలకు ఉగ్రసంస్థలతో లింకులే లేవంటున్నారు పేరెంట్స్.

