పైలెట్ చిత్రపటానికి పాలాభిషేకం

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ చిత్రపటానికి పాలాభిషేకం
– అభిమానం చాటుకున్న పార్టీ శ్రేణులు
– ఎమ్మెల్యేల కొనుగోలు భగ్నంపై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చిత్రపటానికి తాండూరు టీఆర్ఎస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రట్టును చేయడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు గడి ప్రాంతంతో పాటు అంబేద్కర్ పార్కు సమీపంలోని బస్తీ దవాఖాన వద్ద, పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రత్యేకంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పాత తాండూరు బస్తీ దవాఖానా వద్ద టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) తదితరులు జేసీబీ యంత్రంపై ఎక్కి పాలాభిషేకం చేయడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రలోభాలకు లొంగని ధీరుడు పైలెట్ రోహిత్ రెడ్డి అని కీర్తించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర భగ్నంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి గుట్టును రట్టు చేయడం హర్షనీయమన్నారు. పార్టీతో పాటు తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి పాడుతున్న కృషీవలుడు అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కౌన్సిలర్లు, యువనాయకులు పాల్గొన్నారు.