పోలీస్ గన్ మిస్ ఫైర్..!
– గాయాలై కానిస్టేబుల్ మృతి
– కొమురంభీం జిల్లాలో దారుణం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పోలీసు గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్‌కు గాయాలై మరణించాడు. తెలంగాణ రాష్ట్రం కొమురంభీం జిల్లాలోని కౌటాల పోలీస్ స్టేషన్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారు జామును చోటు చేసుకున్నఘటనలో బాధితున్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లికి చెందిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ రజనీ కుమార్ కొమురంభీం జిల్లాలోని కౌటాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో గన్ పేలిన శబ్దం వచ్చిందని స్టేషన్ లో ఉన్న సిబ్బంది బయటకు వచ్చి చూడగా సెంట్రీ రజనీ కుమార్ నేలమీద పడి ఉన్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రజనీ కుమార్‌ను ఆసుపత్రికి తరలించి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని స్టేషన్ సిబ్బంది తెలిపారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ కాగజ్ నగర్ లోని ఆస్పత్రికి వెళ్లి రజనీ కుమార్ పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 11:30 గంటల ప్రాంతంలో రజనీ కుమార్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రజనీ కుమార్ చేతుల్లోని ఎస్ఎల్ఆర్ గన్ పేలడం వల్లే బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో విచారణ జరిపిస్తామని ఎస్పీ వెల్లడించారు.

