అవినీతిమంతులతోనే దేశం ధ్వసం
– ధనబలంతోనే కేసుల్లో నుంచి ఊరట
– ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
దర్శిని డెస్క్: దేశం అవినీతి మంతులతోనే ధ్వంసం అవుతోందని, ధనబలంతోనే కొందరు కేసుల్లో నుంచి తప్పించుకుని ఊరట చెందుతున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టే ఇలా ఆందోళన ఎందుకు వ్యక్తం చేసిందంటే… ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టై జైలుశిక్ష అనుభవిస్తున్న గౌతమ్ నవ్లఖా.. తన అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తనను జుడిషియల్ కస్టడీ నుంచి గృహనిర్బందానికి పంపించాలని ఆశ్రయించారు. ఈకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా సుప్రీంకోర్టు వాదనలు విన్నది. వాద ప్రతివాదాలు జరిగే క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు నవ్లఖా విన్నపాన్ని వ్యతిరేకించారు. నవ్లఖా దేశాన్ని నాశనం చేయాలనుకొంటున్నారని వాదించారు. వాదనలు విన్న తరువాత న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసఫ్, జస్టిస్ హృషికేష్రాయ్ ధర్మాసనం ‘‘మీరు నిజంగా దేశాన్ని నాశనం చేస్తున్నవారెవరో తెలుసుకోవాలనుకొంటున్నారా? ప్రశ్నిస్తూనే దేశాన్ని ధ్వంసం చేస్తున్నది అవినీతిపరులే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వారి మీద ఎవరు చర్య తీసుకుంటున్నారు? వారి పట్ల మనం పక్షపాతంతో ప్రవర్తిస్తున్నామని ఎవరైనా ఆరోపిస్తే కాదనలేం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మన ప్రజాప్రతినిధులను కొనేయడానికి కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచుకున్నామని, పైగా దానిపై కొందరు మాట్లాడుతున్న వీడియోను మేం చూశామని చెప్పుకొచ్చారు. వారు దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని మీరు అనగలరా అని పేర్కొన్నారు. ఎంత అవినీతికి పాల్పడినా ధనబలంతో కొందరు సునాయాసంగా తప్పించుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అదనపు సొలిసిటర్ జనరల్ రాజు.. తాను అవినీతిపరులను సమర్థించడం లేదనీ, వారిపై చర్యలు తీసుకోవాలంటున్నానని చెప్పారు. 70 ఏళ్ల నవ్లఖాను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చడానికి షరతులు, సూచనలను రాజు వివరించాలని సుప్రీంకోర్టు కోరింది. కనీసం కొంతకాలం గృహ నిర్బంధంలో ఉంచి చూద్దామనీ, అతను ఏదైనా తప్పు చేస్తే మళ్లీ జైలుకు పంపవచ్చని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు.

