పీఆర్సీ అమలు చేసేలా చొరవ చూపండి
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కార్మికుల మొర
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ కార్మికులకు పెంచిన పీఆర్సీని అమలు చేసేలా చొరవ చూపాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కార్మికులు మొరపెట్టుకున్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలో 11వ పీఆర్సీ కింద కార్మికులకు పెంచిన వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. కాని తాండూరు మున్సిపల్లో గత 16 నెలలుగా చెల్లించడం లేదని గుర్తుచేశారు. కార్మికుల పీఆర్సీ అంశం ఎజెండా కోర్టులో ఉందని పెంచిన వేతనాలను చెల్లించడం లేదన్నారు. పీఆర్సీ అమలు కోసం సమ్మె కూడ చేపట్టడం జరిగిందన్నారు. దీనిపై ప్రత్యేక చొరవ చూపించి కార్మికులకు పీఆర్సీని అమలు చేసేలా దృష్టిసారించాలని కార్మికులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కార్మికులు తెలిపారు. వచ్చేనెలలో సమస్యకు పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ ఏఐటీయూసీ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

