కేసులు కాస్త తగ్గుముఖం
– కరోనా మరణాలు కూడ
దర్శిని ప్రతినిధి : గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 38,948 కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చుకుంటే.. ఆదివారం దాదాపు 2వేలకు పైగా కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతోపాటు.. నిన్న కరోనా మహమ్మారి కారణంగా 219 మంది మరణించినట్లు వెల్లడించింది. సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దేశంలో రోజువారిగా నమోదయ్యే కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో 4,04,874 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో 68,75,41,762 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 14,10,649 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు (సెప్టెంబర్ 5 వరకు) 53,14,68,867 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న నమోదైన కేసుల్లో కేరళలో 26,701 కరోనా కేసులు నమోదు కాగా.. 74 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621 కి చేరగా.. మరణాల సంఖ్య 4,40,752 కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 43,903 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,21,81,995 కి చేరింది.

