బీజేపీ పొలిటికల్ గేమ్..!
– బల్దియా పీఠం బల పరీక్షకు పోటీ
– మున్సిపల్ చైర్ పర్సన్ పదవిపై దృష్టి
– ఉమ్మడి ప్రకటన చేసిన బీజేపీ కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌పై అధికార పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తీర్మానించడం స్థానిక రాజకీయాలు హీటెక్కాయి. అవిశ్వాసం పెట్టాలని అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్, టీజేఏస్, ఎంఐఎం కూడ మద్దతు ఇచ్చింది. బీజేపీకి చెందిన మొత్తం 5 మంది కౌన్సిలర్లు కూడ అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్‌కు అందించిన నివేధికలో సంతకాలు చేశారు. తాజాగా బీజేపీ కౌన్సిలర్లు పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా తాండూరు చైర్ పర్సన్ స్థానాన్ని చేజేజిక్కించుకునేందుకు ప్లాన్ వేశారు. ఆదివారం బీజేపీ పార్టీకి చెందిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, పూజ రజనీకాంత్, బాలప్పలు ఉమ్మడిగా ప్రకటన జారీ చేశారు. అందులోని సారాంశమేమింటంటే చైర్ పర్సన్ పదవికి జరిగే బల పరీక్షలో బీజేపీ నుంచి పోటీలో ఉంటున్నట్లు వెల్లడించారు. వారితోపాటు బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, బీజేవైఎం నాయకులు కిరణ్ తదిరులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ వర్గపోరు కారణంగా తాండూరు అభివృద్ధి శూన్యంగా మారిందని విమర్శించడం గమనార్హం. అధికార పార్టీ నాయకులకు అభివృద్ధిపై చిత్త శుద్ది లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొబోతుందన్నారు. కావున ఇందులో తామూ కూడ పోటీలో ఉంటామని ప్రకటించారు. పార్టీ తరుపున ఒకరు చైర్ పర్సన్ పదవికి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత రాజకీయాలు మలుపు తిప్పుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు బీజేపీ తీసుకున్న నిర్ణయంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

