ఆవుకు అపురూప వేడుక
– వేద మంత్రాలతో సీమంతం
– 24 వంటకాలతో విందు
– 500 మంది అతిథుల నుంచి కానుకలు
దర్శిని డెస్క్: దేవతలకు ప్రతిరూపంగా ఆవును హిందువులు కొలుస్తారు.. పూజిస్తారు. ఆవుని భక్తితో పెంచుకుంటారు కూడ. ఇంటి సభ్యుల్లా భావించి.. మనుషులకు మాదిరిగా శుభకార్యాలు జరిపిస్తారు. పుట్టిన రోజు , నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి పదిమందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. తాజాగా ఓ కుటుంబం ఆవుకు అపురూపమైన వేడుకలను జరిపించారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం తమిళనాడులోని ఓ గ్రామంలో ఈ దృశ్యం కనిపించింది. మేలపట్టు గ్రామంలో ఉన్న ఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ ఆవును సంరక్షిస్తుంది. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిణిగా ఉన్న ఆవుకు సాంప్రదాయం సీమంతం వేడుక చేశారు. ఈ ఆవు పేరు అంశవేణి. సీమంతం వేడుక సందర్భంగా ఆవును బాగా అలంకరించారు. మహిళలు చక్కగా దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. వేద మంత్రాల సాక్షిగా గోమాతకు వైభవంగా సీమంతం నిర్వహించారు. సీమంతం వేడుక సీమంతం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు గోవుకు స్నానం చేయించారు. అనంతరం పూలతో, గంటలతో అలంకరించారు. వేడుక పూర్తి అయిన తర్వాత.. ప్రజలు ఆవు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకలో దాదాపు 500 మంది అతిథులు కూడా పాల్గొన్నారు. ఈ ఫంక్షన్ లో ఆవుకి మొత్తం 24 రకాల వంటకాల వంటకాలతో విందునిచ్చారు. ఇందులో పండ్లు, స్వీట్లు మొదలైనవి ఉన్నాయి. అంతేకాదు.. సీమంతం చేసుకున్న ఆవుకు అనేక రకాల గిప్టులు అందాయి. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి. ఆ తర్వాత ప్రజలందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.

