చత్రపతి శివాజీ మహారాజ్‌కీ జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చత్రపతి శివాజీ మహారాజ్‌కీ జై..!
– తాండూరులో శోభాయామానంగా శోభాయాత్ర
– అంబరాన్నంటిన శివాజీ జయంతి వేడుకలు
– ర్యాలీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జై శివాజీ.. వీర శివాజీ అంటూ యువకులు నినాదాల చత్రపతి శివాజీ జయంతి వేడుకలను తాండూరులో అంబరాన్నంటే విధంగా జరుపుకున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ యువత మరాఠా యోధున్ని కీర్తించారు. ఆదివారం హిందూ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, జనచైతన్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ జయంతి సందర్భంగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి భారీ శోభాయాత్ర చేపట్టారు.

అక్కడి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర శాంతి మహాల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఇందిరాదౌక్, మల్లప్ప మడిగ మీదుగా శివాజీ చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీలో యువకులు శివాజీ మహారాజ్ కీ జై, జై శివాజీ.. జైజై శివాజీ.. అంటూ నినాదాలు చేశారు. పురవీధుల్లో శోభాయాత్ర శోభాయామానంగా కొనసాగింది. శివాజీ చౌరస్తాలో విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, వెంకన్నగౌడ్, సాహు శ్రీలత, అంతారం లలిత, బంటారం లావణ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, తదితర పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు తాండూరు డిఎస్సీ జీ. శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.