కోడిని చంపేదుకు యత్నించారు..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

కోడిని చంపేదుకు యత్నించారు..!
– పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మహిళ
– ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
దర్శిని డెస్క్‌: రక్షించండీ మహాప్రభో అంటూ ఓ మహిళ పోలీస్టేషన్‌కు వచ్చింది. తన కోడిని చంపేందుకు ప్రయత్నించారని ఆ మహిళ కోడితో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ కోళ్లను పెంచుతూ ఉంటుంది. ఆ కోళ్లు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుంటాయని చెప్పింది. ఆమె కోళ్లలో ఒకదానిని చంపేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారని ఫిర్యాదు చేసింది. తన ఇంటికి ఇరుగుపొరుగు వారే తన కోడిని చంపి తినేయాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళతో పాటు ఆమె భర్త మలిక్రం కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కోడిపిల్లను దొంగిలించి చంపేందుకు ప్రయత్నించిన కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని దంపతులు డిమాండ్ చేశారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇంతకు ముందు పక్కింటి వారు కూడా ఇలాగే కోడిని దొంగిలించారని, ఈ విషయమై ఇరువురికి వాగ్వాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు తనను చంపుతామని బెదిరించారని కూడా వారు పోలీసులకు వివరించారు. గాయపడిన కోడిని చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన దంపతుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని ఒప్పించి ఇంటికి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ప్రసాద్ సిన్హా తెలిపారు. ఈ ఫిర్యాదు విని పోలీసులే ఆశ్చర్యపోయిన సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.