మళ్లీ అమ్మకానికి రాజీవ్ స్వగృహ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మళ్లీ అమ్మకానికి రాజీవ్ స్వగృహ..!
– అమ్మకపు వేలం ప్రక్రియ వేగవంతం
– తాండూరులో భూములను పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్
– జిల్లాలో స్వగృహ భూముల విస్తీర్ణం ఏమేరకు ఉందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో రాజీవ్ స్వగృహ భూములను అమ్మేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలంపల్లి రెవెన్యూ పరిధిలోని బిల్లా దాఖలాలో రాజీవ్‌ స్వగృహ భూములతో పాటు తాండూరు పట్టణ శివారు రాజీవ్ స్వగృహ, తాండూరు మండలంలోని సిరిగిరిపేట్‌లోని రాజీవ్ స్వగృహ భూములను వేలం వేసేందుకు ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇందులో భాగంగా బుధవారం వికారాబాద్‌ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్‌ శర్మ తాండూరులో పర్యటించారు. ముందుగా పట్టణ శివారు హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మనోహా టౌన్‌ షిఫ్‌లో మిగిలిపోయిన ప్లాట్లు, భూములను పరిశీలించారు. అనంతరం తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామ శివారు సర్వేనెంబర్ 109లో స్వగహ భూములను పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇండ్లు కట్టించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో పథకం విజయవంతం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ భూములను వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లాలో పలు దఫాలుగా రాజీవ్ స్వగృహ భూముల వేలం చేపట్టారు. తాజాగా మరోసారి భూములను వేలం వేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్‌ లోని అలంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న బిల్లా దాఖలాలో 15 ఎకరాలు, తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామ శివారు సర్వేనెంబర్ 109లోని 26 ఎకరాలతో పాటు పట్టణ శివారులోని మనోహా టౌన్‌ షిప్‌లో రాజీవ్ స్వగృహలో గల 54 గృహాలు, 14 ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు ప్రక్రియ వేగవంతం అవుతోంది. తాజాగా బుధవారం అడిషనల్‌ కలెక్టర్ రాహుల్‌ శర్మ తాండూరు పట్టణంతో పాటు మండలంలో చేపట్టిన భూములను పరిశీలించారు. ఈ నివేధికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. మరోవైపు రాజీవ్‌ స్వగృహ భూముల వేలంపై కొనుగోలు దారులకు విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో నిర్వహించిన వేలం విధానానికి స్పందన అంతంత మాత్రమే లభించింది. అయితే అధికారులు మరోసారి వేస్తోన్న వేలం మంత్రం ఏమేరకు పారుతుందో వేచి చూడాలి.

ఈనెల 17,18తేదిలలో బహిరంగ వేలం
———————————–
మరోవైపు యాలాల్ మండలంలోని కూకట్ గ్రామ పరిధిలో ఉన్న రాజీవ్ స్వగృహలో గల 54 గృహాలు, 14 ఓపెన్ ప్లాట్లను ఈనెల 17, 18 తేదీలలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలియజేశారు. బహిరంగ వేలంకు సంబంధించి స్థానిక ఆర్డిఓ కార్యాలయం తాండూర్ లో ఈనెల 4న మరియు 14న ఫ్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఆర్డీవో అశోక్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.