ఆకాశ‌పు ఔష‌దానికి ముహుర్తం ఖ‌రారు

ఆరోగ్యం జాతీయం తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్

ఆకాశ‌పు ఔష‌దానికి ముహుర్తం ఖ‌రారు
– ఈనెల 11న వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభానికి ఏర్పాట్లు
– లాంచ‌నంగా ప్రారంభించ‌నున్న కేంద్ర మంత్రి జ్యోతిరాథిత్య‌, మంత్రి కేటీఆర్
– ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ సంస్థ‌ల‌ భాగస్వామ్యంతో ప్ర‌యోగాత్మ‌కంగా వికారాబాద్ జిల్లాలో చేప‌ట్ట‌బోతున్న‌ ‘ మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ‘ కార్యక్రమానికి ముహుర్తం ఖ‌రాయ్యింది. ఈనెల 11వ తేదిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింధీయ, రాష్ట్ర మున్సిప‌ల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లు ఈ ప్రాజెక్టును ప్రారంభించ‌బోతున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల‌లోని ఆరోగ్య కేంద్రాల‌కు, ఇత‌ర ప్రాంతాల‌కు డ్రోన్ల ద్వారా ఔష‌ధాల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా స్కై మెడిసిన్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఔష‌దాల‌ పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS) డ్రోన్ విమానాలు ఉపయోగించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేశారు. ఇందుకోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) క్లియరెన్స్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ప్రపంచ ఆర్థిక వేధిక‌, నీతి ఆయోగ్, హెల్త్‌నెట్ గ్లోబ‌ల్ సంస్థ‌లు వికారాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప‌ట్లోళ్ల స‌బితా ఇంద్రారెడ్డి జిల్లా కేంద్రాన్ని సంద‌ర్శించారు.
జిల్లా ఎస్పీ కార్యాల‌యంలోని పేరేడ్ మైదానాన్ని ప‌రిశీలించారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల‌, జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌ల‌తో క‌లిసి ఇక్క‌డి నుంచి డ్రోన్‌లు ఎగిరించే స్థ‌లాన్ని, స‌మావేశం ప్రాంతాన్ని, మీడియా గ్యాలరీలను పరిశీలించారు. స్కై మెడిషిన్ ప్రారంభోత్స‌వంలో ఎలాంటి అవాంత‌రాలు క‌ల‌గ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి స‌బితారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సూచ‌న‌లు చేశారు. దేశ వ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకుముందు మంత్రి స‌బితారెడ్డి అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సందర్శించి.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించ‌నున్న‌ఆర్టిపిసిఆర్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు.