విహారయాత్రలో విషాదం..!
– కాగ్నానదిలో నీట మునిగిన ఇద్దరు వ్యక్తులు
– ఒకరి మృతి, మరొకరి గల్లంతు
– గాలింపు కోసం పోలీసుల ముమ్మర చర్యలు
– యాలాల కోకట్ సమీపంలో ఘటన
యాలాల, దర్శిని ప్రతినిధి : విహారయాత్ర కోసం వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. సరదాగా ఈత కోట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతు అయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషాదకర సంఘటన బుధవారం యాలాల మండలం కోకట్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మోయిజ్(28), సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ ప్రాంతానికి చెందిన అతని బందువు రహమత్ అనే వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానది వద్దకు సరదా కోసం వెళ్లారు.

అక్కడ మోయిజ్, రహమత్‌లు సరదాగా ఈత కొట్టేందుకని నదిలోకి దిగారు. కొద్ది సేపటికి ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో మోయిజ్ నీటిలో మునిగి మృతి చెందగా.. రహమత్ వాగులో గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు యాలాల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోయిజ్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.

రహమత్ ఆచూకి తెలియకపోవడంతో పోలీసులు గత ఈతగాళ్లను రప్పించారు. గల్లంతు అయిన రహమత్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సరదా కోసం వచ్చి ఒకరు మృతి చెందడం.. మరొకరు గల్లంతు కావడంతో ఈ సంఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


