మహిళా సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం
– సంఘాల ద్వారా వ్యాపారాలకు అవకాశాలు
– ఆర్థికాభివృద్ధికి వడ్డిలేని రుణాలు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మహిళ సంఘాలకు రూ. 28.19 కోట్ల అందజేత
– మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
– మున్సిపల్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళా సంఘాల అభివృద్ధే ప్రాధాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మహిళా వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరంకు గాను బ్యాంక్ లింకేజు ద్వారా 212 సంఘాలకు రూ.28.19 కోట్ల చెక్కును అందజేశారు. వడ్డిలేని రుణాలు 1001 సంఘాలకు రూ. 1,61,64,759లను అందజేశారు. అదేవిధంగా 18,600 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపీణీ చేశారు.

అంతకుముందు ముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహిళ సంఘాల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని తెలిపారు. తాండూరు నియోజకవర్గంకు 4 ఆర్టీసీ బస్సులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం వ్యాపార రంగాలలో అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. మహిళా సంఘాలకు ఆదాయ వనరులు చేకూర్చాలని ఉద్దేశ్యంతో వడ్ల కొనుగోలు కేంద్రాలు, చిరు వ్యాపారాలు, స్కూల్ యూనిఫామ్స్ తయారీ, మహిళా శక్తి క్యాంటీన్స్, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్య సంస్థలలో మౌలిక సదుపాయల కల్పన మహిళ సంఘాలకు అప్పగించడం జరిగిందని వివరించారు.

తాజాగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మహిళా సమైక్య భవనాలు, నిర్మాణానికి నిధులు కూడ మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. నూతనంగా మంజూరైన మహిళా సమైక్య భవనాల పనులు త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు తాండూరు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద వహించడం జరుగుతుందని చెప్పారు. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వితంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందన్నారు. రూ. 60 కోట్లతో కాగ్నానది పైపులైన్ పనులు, అమృత్‌ 2.0 ద్వారా ట్యాంకుల నిర్మాణం చేపట్టి వీలిన కాలనీలో తాగునీటి కష్టాలను దూరం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, నాయకులు ప్రభాకర్ గౌడ్, మహిళ నాయకురాలు గాజుల మాధవి, కౌన్సిలర్లు, మెప్మా అధికారులు, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సర్‌తో ఓట్ల తోలగింపుకు కుట్ర