టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు వేళాయే..!
– రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్
– నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల ఏర్పాటు
– ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు పోలింగ్ జరుగున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, యాలాల మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్, బషీరాబాద్ మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్, పెద్దేముల్ మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 438, యాలాలో 81, పెద్దేముల్ లో 23, బషీరాబాద్ మండలంలో 30 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్ విధించింది. దీంతో పాటు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను చేసింది.

