కుక్కకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు
– హత్య కేసును చేధించినందుకు పురస్కారం
దర్శిని డెస్క్: ప్రభుత్వ శాఖలో అధికారులకు, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులకు బెస్ట్ ఎంప్లాయిమెంట్ అవార్డులు ఇవ్వడం సాధారణమే. కాని పోలీసుశాఖలో అధికారులు ఓ కుక్కకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందజేశారు. దానికి ఊరికే ఇవ్వలేదు. హత్య కేసులో నిందితులను రికార్డు సమయంలో పట్టించినందుకు ఈ అవార్డును అందించారు. ఉత్తరాఖండ్ పోలీస్ శాఖకు చెందిన ఓ శునకం ‘బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్’గా ఈ అవార్డు పొందింది. జస్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 6న షకీబ్ అహ్మద్ అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ కేసు కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే అనుమానితులను వరుసగా నిలబెట్టగా.. కేవలం 30 సెకన్లలోనే నిందితుడిని పట్టించింది ఈ శునకం. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన శునకానికి అవార్డుతో పాటు రూ. 2,500 నగదు పురస్కారాన్ని కూడా అందజేశారు. ఈ విషయాన్ని ఉద్దమ్‌సింగ్ నగర్ ఎస్‌ఎస్‌పీ మంజునాథ్ తెలిపారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.

