డబుల్‌కు పోటెత్తిన లబ్ధిదారులు

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌కు పోటెత్తిన లబ్ధిదారులు
– మొదటి రోజు 2,196 దరఖాస్తులు
– వెల్లడించిన తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం కోసం తాండూరులో లబ్దిదారులు దరఖాస్తులు చేసుకునేందుకు పోటెత్తారు. సోమవారం నుంచి తాండూరులో డబుల్ బెడ్ రూం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. డబుల్ దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి 6 వార్డులకు ఒక కేంద్రం చొప్పున 6- కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఇందిరానగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 1, కొత్త మున్సిపల్ కార్యాలయంలో-1, పాత మున్సిపల్ కార్యాలయంలో-2, పాత తాండూరు బస్తీ దవాఖానలో – 1, రైతు బజార్‌లో-1 దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి లబ్దిదారులు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆయా కేంద్రాల వద్ద డబుల్ దరఖాస్తుల సందడి కనిపించింది. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 2,196 మంది ద్వారా దరఖాస్తులు అందినట్లు తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు తెలిపారు. పట్టణ ఆరోగ్య కేంద్రంలో 450, కొత్త మున్సిపల్ కార్యాలయంలో 372, పాత తాండూరు బస్తీ దవాఖానలో 350, రైతుబాజర్లో 471, పాత మున్సిపల్ కార్యాలయంలోని 1 కేంద్రంలో 240, రెండో కేంద్రంలో 313 మంది దరఖాస్తులు అందించినట్లు వివరించారు. మొదటి రోజు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకునేందుకు కాస్త తడబడ్డారు. మరోవైపు పలు కేంద్రాల వద్ద బారులు తీరిన లబ్దిదారులకు తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది.