డబుల్‌ బెడ్‌ రూంకు రేపే లాస్ట్ చాన్స్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌ బెడ్‌ రూంకు రేపే లాస్ట్ చాన్స్‌
– ఇప్పటికే 7074 దరఖాస్తులు
– లబ్దిదారులు త్వరపడాలంటున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేస్తున్న డబుల్‌ బెడ్‌ రూం దరఖాస్తుల కోసం రేపు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాండూరులోని హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీకి సంబంధించి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు పట్టణంలోని 36వ వార్డుల నుంచి 6 కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు రేపు శనివారంతో ముగుస్తోంది. ఇప్పటికే మూడు రోజులుగా పట్టణంలోని ఆరు కేంద్రాల నుంచి 7074 దరఖాస్తులను స్వీకరించారు. మొదటి రోజు 2,196, రెండో రోజు 2,832, మూడో రోజు 2046 దరఖాస్తులను స్వీకరించారు. గురువారం శ్రీరామ నవమి సెలవు సందర్భంగా దరఖాస్తులను స్వీకరించలేదు. శుక్రవారం నాలుగో రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే దరఖాస్తుల స్వీకరణకు రేపు శనివారం వరకు మాత్రమే గడువు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని లబ్దిదారులు త్వరపడి సంబంధిత కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.