పోడు రైతులకు శుభవార్త
– ఈ నెలాఖరులోపు భూముల పంపిణీ
– శాసన సభలో ప్రకటించిన సీఎం కేసీఆర్
– తరువాత సదుపాయాలపై కీలక హామిలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అర్హులైన రైతులకు ఈనెలాఖరులోగా భూములు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఆ తరువాత వాటికి రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పి్స్తామని చెప్పారు. శుక్రవారం జరిగిన శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసు. పోడు భూములపై మాకు ప్రత్యేక విధానం ఉంది. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరులోపు పోడు భూముల పంపిణీని ప్రారంభిస్తాం. 11.5లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తాం. ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని.. పట్టాలు ఇచ్చాక గజం భూమినీ ఆక్రమించబోమని ప్రభుత్వానికి హామీ ఇవ్వాలి. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తాం. ఆ భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయొద్దు.. అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులను సహించబోం. ఇకపై అటవీ ప్రాంతాల్లో ఒక్క చెట్టూ కొట్టనివ్వం’’ అని కేసీఆర్ అన్నారు.

