సరిహద్దులో అప్రమత్తం..!
– చెక్ పోస్టులలో పకడ్భందీగా నిఘా
– పోలీసులో ప్రత్యేకంగా తనిఖీలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– సరిహద్దు చెక్ పోస్టుల సందర్శన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్త చర్యలు చేపట్టడం జరిగిందని, చెక్ పోస్టు ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు.

మంగళవారం కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులపల్లి చెక్ పోస్ట్, కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్లాపూర్ చెక్ పోస్టుతో పాటు కర్ణాటక రాష్ట్రం ముద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిబ్బంపల్లి చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం లో ఎన్నికల నేపధ్యంలో కర్ణాటక రాష్ట్రం తో సరిహద్దులు కల్గిన పోలీస్ స్టేషన్ పరిధిలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా లో మొత్తం 5 పోలీస్ స్టేషన్ పరిధిలలో మొత్తం 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా డబ్బులు, మద్యం రవాణా చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా నేరస్థులు లపైనా నిఘా ఉంచుతున్నామన్నారు. చెక్ పోస్టులతో పాటు కర్ణాటక రాష్ట్రం తో సరిహద్దులు కల్గిన గ్రామాలలో ఆకస్మికంగా సందర్శించి కార్దన్ సెర్చ్ లు, వాహనాల తనిఖీలు, నాకాబందీ, లాడ్జిలు, ధాబాలు, హోటల్ లు తనిఖీలు చేస్తామన్నారు. ఆయా గ్రామాలలో నేరస్థులను గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేస్తామన్నారు. ఎవరైనా తమ వ్యాపార రీత్యా గాని ఇతర విషయాలకు గాని డబ్బులు తరలిస్తే వాటికి సంబంధించిన రసీదులు తప్పనిసరిగా తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. లేదంటే డబ్బులు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీస్ అధికారులకు సహకరించాలని సూచించారు. ఎస్పీ వెంట పరిగి డిఎస్‌పి కరుణా సాగర్ రెడ్డి, తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్, కోడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్, కరణ్ కోట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్‌ఐ లు సిబ్బంది తదితరులు ఉన్నారు.

