టమాట లోడ్ లారీ బొల్తా..!
– లారీకి బందోబస్తుగా పోలీసులు
– సంచలనంగా మారిన సంఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అమాంతం పెరుగుతున్న పోతున్న టమాట ధరలతో ఎన్నో వింత వింత సంఘటనలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో మీమర్స్ చేస్తున్న చిత్రాలే కాకుండా రాజకీయాల్లో సైతం దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే టామాటల కోసం దొంగతనాలు, పోలీసుల రక్షణ వంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీలు బోల్తా పడడంతో స్థానికులు దోచుకెళ్లడంతో అక్కడ పోలీసులు బందోబస్తు కల్పించారు. మరింత వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో టమాటా లోడుతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటకలోని చింతమనుగురు నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా వాంకిడి మండలంలోని సమేల గ్రామంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
లారీ బోల్తా పడటంతో అందులోని దాదాపు రూ. 15లక్షల విలువైన టమాటాలన్నీ నేల పాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. టమాటాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టారు. టమాటా ధరలు భారీగా ఉన్నందున వాటిని ఎవరూ తీసుకెళ్లకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తుగా కల్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్దరాత్రి 12 దాటినా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలవ్వగా.. వారిద్దరిని అంబులెన్స్‌లో స్ధానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి…


