బాలాపూర్ ల‌డ్డూకు రికార్డు వేలం

తెలంగాణ హైదరాబాద్

బాలాపూర్ ల‌డ్డూకు రికార్డు వేలం
– రూ. 18 ల‌క్ష‌ల 90వేల‌కు ద‌క్కించుకున్న శ‌షాంక్ రెడ్డి
హైదరాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ‌త‌ 26 ఏళ్లుగా లడ్డూవేలంపాటలో ప్రత్యేకతను చాటుకున్న బాలాపూర్‌ గణేశుడు.. ఈ ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకేత్తించింది. బాలాపూర్‌లో లడ్డూ వేలం మళ్లీ రికార్డ్‌ సృష్టించింది. నువ్వా..నేనా అన్నట్టు పోటాపోటీగా సాగిన వేలంలో మర్రి శశాంక్‌ రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. 18లక్షల 90వేల రూపాయల ధర పలికి లడ్డూను ద‌క్కించుకున్నారు. ఈసారి ల‌డ్డూకు 2019 కంటే లక్షా 30వేల రూపాయలు అధికంగా వచ్చాయి. గతేడాది 17లక్షల 60వేల రూపాయల ధర పలకగా..ఈసారి 18లక్షల 90వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు మర్రి శశాంక్‌రెడ్డి.

41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్‌ గణపతి నిమజ్జన వేడుకలు ఈ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. ఐదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఆఖరిపూజ పూర్తిచేసుకున్న లంబోదరుడు గ్రామ ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్​పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగిస్తారు. 9 గంటలకు గణపతి ప్రధాన కూడలి వద్దకు చేరుకోగానే వేలంపాట కొనసాగుతుంది. వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న వ్యక్తిని సన్మానించిన తర్వాత ..ట్యాంక్‌బండ్‌ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.

వంద‌ల నుంచి ల‌క్ష‌ల దాకా..
1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలంపాట..వందలు వేలు దాటి..రికార్డుస్థాయిలో లక్షలు పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య వేలంపాట నువ్వా..నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. 2016లో మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్‌ రెడ్డి 14లక్షల 65 వేలకు దక్కించుకున్నారు. 2017లో తిరుపతిరెడ్డి 15లక్షల 60వేలకు లడ్డూను వేలంపాటలో కైవసం చేసుకున్నారు. 2018లో శ్రీనివాస్‌గుప్తా 16లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. అత్యధికంగా బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబీకులే లడ్డూను వేలంపాటలో 9 సార్లు దక్కించుకున్నారు. 2019లో బాలాపూర్ లడ్డూ.. రికార్డుస్థాయిలో 17లక్షల 60 వేల రూపాయలు పలికింది. గతేడాది కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రద్దు చేశారు.