గేరు మార్చిన ఎమ్మెల్సీ..!
– ఎమ్మెల్యేగా పోటీపైనే మహేంద్రుడి మొగ్గు..?
– బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో చాన్స్‌లకు తుది గడువు
– ఎమ్మెల్సీ శిబిరంలో రోజుకో పరిణామం
– మహేంద్రుడి స్టెప్‌పై ప్రతిపక్షాలు, ప్రత్యర్థుల దృష్టి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మాజీ రవాణా శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పోలిటికల్ గేరును రోజుకో రకంగా మారుస్తున్నారు. అసెంబ్లీ పోరు విషయంలో బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు టెన్షన్ పెట్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు ఎమ్మెల్సీ వర్గం నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ముందు, ఏర్పడిన తరువాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి రాజకీయాల్లో చక్రం తిప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైలెట్ రోహిత్ రెడ్డిపై స్వల్వ ఓట్లతో ఓటమి చెందారు. అయినా కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతూ తన హవాను చాటుకుంటున్నారు.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పోటీపై రోజుకో విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గట్టిగా చెప్పిన మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగులకు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు టిక్కెట్టు ఇవ్వాలని నిర్ణయించిందనే ఊహాగానాలతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి టిక్కెట్టు దక్కదనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని వదులుకోలేక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకు మంత్రి పదవి, రాజ్యసభ స్థానం కల్పించాలని నిర్ణయించిందని, మంత్రి హరిష్ రావు సమక్షంలో ఓ రాయబార నేత మద్య చర్చలు జరిగినట్లు ప్రచారం సాగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే టిక్కెట్టు కన్ఫాఫ్ అనే సంకేతాలు కనిపించాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లోనే మకాం వేయడంతో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అందరు భావించారు. ఈ పరిణామాల మద్య తాండూరుకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు మహేందర్ రెడ్డితో భేటి అయ్యారు. అక్కడా కూడా మహేందర్ రెడ్డి ఎన్నికల బరిలో నిలబడడం లేదనే కనిపించినట్లు ఆయన వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి టిక్కెట్టు వచ్చినా రాకున్నా పోటీ చేయాలని మహేందర్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు సమచారం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని, వెంట వస్తామని నేతలు అభిప్రాయాలను ఎమ్మెల్సీకి వివరించినట్లు అందరు చర్చించుకుంటున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన పోటికల్ గేరును మార్చుకుంటున్నట్లు కనిపిస్తోందని తాండూరు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 22వ తేది లోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్టు కోసం వేచి చూడాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం మహేందర్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని ధీమాలో ఉన్నారు. మహేందర్ రెడ్డికి చేరికకు ఈనెల 25వ తేది వరకు గడువు ఇచ్చినట్లు తెలిసింది. మరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీకి టిక్కెట్టు వస్తే పార్టీలో ఉంటారా, లేదా కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మహేందర్ రెడ్డి ఎటువైపు స్టెపు వేస్తారనే దానిపై ప్రత్యర్థులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు దృష్టిసారిస్తున్నారు. ఆ తరువాతే కార్యాచరణకు సిద్దం కావాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయా పార్టీల కార్యకర్తల గుసగుస.
ఇది కూడా చదవండి…

