అతలాకుతలం..!
– భారీ వర్షంతో ఇండ్లలోకి నీరు
– మడుగులా మారిన షాపింగ్ కాంప్లెక్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం పట్టణ వాసులను అతలాకుతలం చేసింది. ఇండ్లలోకి నీరు రావడంతో పాటు ఓ షాపింగ్ కాంప్లెక్స్ మడుగులా మారింది. బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడ భారీ వర్షం కుసింది. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో పట్టణంలోని రహదారులన్నీ గోదారులయ్యాయి. మురుగు కాలువలు పొంగిపొర్లాయి. పట్టణంలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై పారిన నీరంతా శాంత్ మహాల్ కాంప్లెక్స్‌లోకి చేరాయి. అక్కడ ఉన్న ఓ రెడిమేడ్ షాఫు, హోటల్, మెడికల్ షాపులోకి నీరంతా చేరడంతో షాపులన్నీ చిన్నపాటి మడుగులా మారాయి.
మరోవైపు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే బ్రిడ్జీ సమీపంలోని పలువురి ఇండ్లలోకీ భారీగా వర్షపునీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
పరిశీలించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
ఇండ్లలోకి వర్షపునీరు చేరిందని వార్డు ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణితో కలిసి ఇండ్లను సందర్శించారు.
ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులతో కలిసి పరిస్థితిని ఆరా తీశారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.