ఆన్‌లైన్‌లో ఓపీ సేవలు..!
– ఆసుపత్రుల్లో అమలుకు కరసరత్తు
– రోగులకు మరింత ప్రయోజనం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ (ఓపీ) చీటీ విధానానికి స్వస్తి పలికి ఆన్ లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆధునిక సాంకేతికతను అనుసంధానం ఇప్పటికే ఈ విధానాన్ని ఆసుపత్రుల్లో అమల్లోకి తీసుకవచ్చింది. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులకు విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
ఎలా అమలు చేస్తారంటే..?
ప్రస్తుతం ఆసుపత్రిలో ఎవరైనా చికిత్స కోసం ఓపీ చీటీ తీసుకుని వైద్యులను సంప్రదించేవారు. దాని ఆధారంగా వైద్యులు చికిత్స సేవలు అందించేవారు. అమల్లోకి తెచ్చిన కొత్త విధానంలో వైద్యానికి వచ్చిన వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత రోగికి సంబంధించి ఒక సీఆర్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ వ్యక్తి ఎప్పుడు ఆసుపత్రికి వచ్చినా ఈ నంబర్ ద్వారా వైద్యసేవలు అందుతాయి. రోగికి సంబంధించిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఆ వ్యక్తి తర్వాత ఆసుపత్రికి వస్తే ఆధార్ లేదా సీఆర్ నంబర్ నమోదుచేస్తే రోగికి సంబంధించిన పూర్తి రికార్డు వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో ఆ వ్యక్తి గతంలో ఎలాంటి సమస్యతో వచ్చారు.. ఎవరు చికిత్స చేశారు.. ఎలాంటి చికిత్స అందించారు.. వంటి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.
తదుపరి ఎలాంటి వైద్యం అందించాలనే అంశంలో వైద్యుడికి స్పష్టత వస్తుంది. వేరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఈ వివరాలన్నీ అందుబాటులో ఉండటం వల్ల చికిత్స సులువు అవుతుంది.రోగి వేలిముద్రతో కూడా వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. రెండోసారి ఆసుపత్రికి వచ్చినపుడు ఆధార్ సంఖ్య నమోదు చేసి ఆన్‌లైన్ ఓపీ ఇస్తారు. ఈ-సుశ్రూత్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ల ద్వారా ఓపీ వివరాలు నమోదు చేస్తున్నారు.
రోగులకు లభించే ప్రయోజనాలు
కొత్త విధానంలో రోగులకు ప్రయోజనాలు కొందే అవకాశం ఉంది. ఆన్‌లైన్ ఓపీ విధానంతో రద్దీ సమస్య తీరుతుంది. ఒకసారి వివరాలను నమోదు చేసుకుంటే ఇక ప్రతిసారీ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా రెండోసారి ఆసుపత్రికి వచ్చినపుడు జాప్యం లేకుండా వైద్యసేవలు అందుతాయి. చికిత్స, వైద్యం, మందుల వివరాలను ఎప్పుడు కావాలన్నా పరిశీలించుకోవచ్చు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఈ రికార్డు అందుబాటులో ఉంటుంది. ‘ఈ-సుశ్రూత్’ యాప్‌లో వివరాలు ఉండటంతో వైద్యులు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనేది ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర ఉన్నత వైద్యులు పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి…

