సొంతగూటికి డాక్టర్ సంపత్ కుమార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సొంతగూటికి డాక్టర్ సంపత్ కుమార్..!
– ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేత
– కాంగ్రెస్‌లో చేరిన మరో నేత ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ సంపత్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ సొంతగూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలతో ఇమడలేక తిరిగి ఆయన కాంగ్రెస్‌ చేరేందుకు నిర్ణయించారు. 2018కి ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ సంపత్ కుమార్ ఆ యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గంలో కొనసాగుతూ వచ్చారు. కొన్నాళ్ల తరువాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో డాక్టర్ సంపత్ కుమార్ దూరంగా ఉన్నారు. కొన్ని నెలలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని వీడి మంత్రి మహేందర్ రెడ్డి వర్గంలో చేరారు. అప్పట్లో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కాని తాండూరు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపులో భాగంగా జరిగిన బుజ్జగింపులో మహేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. దీంతో భంగపడిన డాక్టర్ సంపత్ కుమార్ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సంపత్ కుమార్ శనివారం తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్‌ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అదేవిధంగా తాండూరు ప్రాంతానికి చెందిన మరో నేత ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు