ఎలక్షన్ అక్రమాలకు చెక్..!

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఎలక్షన్ అక్రమాలకు చెక్..!
– ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్‌లు
– అభ్యర్థుల చరిత్ర కూడా తెలుసుకునే అవకాశం
దర్శిని డెస్క్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో, ఓటర్లలో టెన్షన్ ఏర్పడుతోంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పనిలో పనిగా ఎన్నికల్లో ఎలాంటి అక్మరాలు జరగకుండా ఉండేందుకు ఓటర్లను, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కూడా చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, వివిధ యాప్‌ల ద్వారా అక్రమాలను కట్టడి చేయడంతో పాటు, ఫిర్యాదులు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తోంది. అవేంటో కింద తెలుసుకుందాం.

వంద నిమిషాల్లో చర్యలు
‘సి విజిల్‌’ పేరిట ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు గుర్తించిన అక్రమాలను ఆ యాప్‌లో సచిత్రంగాగానీ, సంక్షిప్తంగాగానీ నమోదు చేస్తే చాలు. వంద నిమిషాల వ్యవధిలో అధికారులు అక్కడికి చేరుకుని సదరు సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఎలాంటి చర్యలు తీసుకున్నదీ ఫిర్యాదు పంపిన వ్యక్తి ఫోన్‌కు సంక్షిప్త సందేశం రూపంలో తెలియజేస్తారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

 

ఇక్కడ ఫిర్యాదులు చేయొచ్చు..
ప్రజలు ఎన్నికల సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు నేషనల్‌ గ్రీవెన్స్‌ సర్వీసెస్‌(ఎన్‌జీఎస్‌) పేరిట ఒక పోర్టల్‌ (https://eci-citizenservices.eci.nic.in) అందుబాటులో ఉంది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను అందులో నమోదు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఫిర్యాదులనైనా అందులో నమోదు చేయవచ్చు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర వివరాలను పొందుపరిస్తే సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి చర్యలు చేపడతారు.


సక్షమ్‌
వయోవృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం ఈ యాప్‌ను రూపొందించారు. పోలింగ్‌ కేంద్రానికి సొంతంగా రాలేని వారు ఇందులో పేర్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చేందుకు అధికారులు రవాణా సదుపాయాన్ని కల్పిస్తారు. వాలంటీర్‌ను అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు చక్రాల కుర్చీ సదుపాయాన్ని కల్పిస్తారు.

అభ్యర్థి వివరాలు
మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి (నో యువర్‌ క్యాండిడేట్‌, కేవైసీ) పేరిట అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన ప్రమాణపత్రాల(అఫిడవిట్లు)ను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల సంఘం https://affidavit.eci.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. బరిలో నిలిచిన అభ్యర్థి ఎలాంటి వారు, వారికి నేర చరిత్ర ఏమైనా ఉందా? ఏఏ ఆస్తులు ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు.

మీ ఓటు ఉందా లేదా తెలుసుకోండి..
ఓటర్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌(వీహెచ్‌ఏ) పేరిట ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఓటు నమోదు చేసుకునేందుకు వీలుగా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయా? లేదా? అనేదీ తెలుసుకోవచ్చు. ఇ-ఎపిక్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

మోగిన ఎలక్షన్ నగారా..!