తాండూరును అగ్రపథంలో నిలపడమే ధ్యేయం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరును అగ్రపథంలో నిలపడమే ధ్యేయం
– గెలిపించుకునే ప్రజల రుణం తీర్చుకోవడం బాధ్యత
– రూ.1672 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
– రూ.1648 కోట్లతో ప్రజా సంక్షేమానికి కృషి
– కాంగ్రెస్, బీజేపీని నమ్మి ఆగంకావొద్దు
– జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
– ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గాన్ని అగ్రపథంలో నిలపడమే తన ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాండ్యూర్లో జర్నలిస్టులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఐదేండ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై దాదాపు గంటకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేశారు.

ఎన్నికల ముందు తరువాత ఇచ్చిన హామిలను నెరవేర్చడం జరిగిందన్నారు. గతంలో పెండింగ్లో ఉండిపోయిన రింగురోడ్డు, బైపాస్ రోడ్డు, రోడ్డు విస్తరణ వంటి పనులలో పురోగతి తీసుకరావడం జరిగిందన్నారు. తన హాయాంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో కృషి చేయడం జరిగిందన్నారు. జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి దశను మార్చడం జరిగిందన్నారు. తాండూరు నర్సింగ్ కాలేజీ, కాగ్నానదులపై చెక్ డ్యాంల నిర్మాణం, ఐటీఐ కాలేజీ, పారిశ్రామిక వాడ, బంజార భవన్, బీసీ భవన్ వంటి ప్రగతి పనులను సాధించడం జరిగిందన్నారు. మండలాల్లో గ్రామాల రోడ్లు, విద్యుత్, బ్రిడ్జిలు, పల్లె దవఖానలు, వంటి ప్రగతి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
దీంతో పాటు ప్రభుత్వ పథకాలు అసరా, రైతుబందు, రైతు బీమా, రుణమాఫీ, గృహలక్ష్మీ, మైనార్టీ బందు, కేసీఆర్ కిట్స్, కంటి వెలుగు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, దళిత బందు, బీసీ బందు, గొర్రెల పంపిణీ పథకాలను రాజకీయాలకు అతీతంగా అమలు చేయడం జరిగిందన్నారు. ఐదేళ్లలో తాండూరు పట్టణానికి రూ. 1191.86 కోట్లు, మండలానికి రూ.236, 14 కోట్లు, యాలాల మండలానికి రూ. 97.77 కోట్లు, బషీరాబాద్ మండలానికి 68.18 కోట్లు, పెద్దేముల్, కోట్ పల్లి మండలాలకు రూ. 78.54 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. మొత్తం రూ. 1672.49 కోట్లతో అభివృద్ధి, రూ.1648.12 కోట్లతో సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ప్రగతి పత్రాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా ఇప్పటికే యువతకు ఉద్యోగాలు, మహిళలకు, ఆటో డ్రైవర్లు, పలువురికి రోహిత్ అన్న చేయూత అందించడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల తరువాత అన్ని రంగాల్లో మౌళిక సదుపాయాలను కల్పించి అందరికి ఆర్థిక భరోసా లభించే విధంగా కృషి చేస్తానని అన్నారు.

ప్రతిపక్షాలను నమ్మేది లేదు
ఎన్నికల ముందు ప్రతిపక్షాలు తాండూరు ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ద్వజమెత్తారు. తాండూరు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దనే ఉద్దేశంతో బీజేపీ కుట్రను బయటపెట్టడం జరిగిందని, ఫాంహౌజ్ సంఘటనను గుర్తుచేశారు. కాంగ్రెస్ లో రోజుకో వలస దారులు పోటీ చేసేందుకు వస్తున్నారని అన్నారు. తాండూరు నియోజకవర్గ స్థితి గతులపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో. తెలియని, వారికి అభివృద్ధికి చిత్త శుద్ధి లేదని అన్నారు. పబ్బం గడుపుకునేందుకు వచ్చిన వలసదారులను ప్రజలు నమ్మరని అన్నారు. తాండూరుకు వలసదారులు రావొద్దని, చేతనైతే వాళ్ల ప్రాంతల్లో పోటీ చేయాలని అన్నారు. మా తాండూరును అభివృద్ధి చేసుకున్న సత్తా మాకుందన్నారు. ఇక్కడికి వస్తే పుట్టగతులు ఉండవన్నారు. కాని ప్రజలు స్థానికులకే పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, తనకు భారీ మెజార్టీ అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

16 నుంచి రంగంలోకి
15వ తేదిన సీఎం కేసీఆర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టో ప్రకటిస్తున్నారని అన్నారు. 16వ తేది నుంచి నియోజకవర్గంలో పక్కా ప్రణాళికలతో ప్రజా క్షేత్రంలోకి వస్తున్నామన్నారు. మెనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా పథకాలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి, నిరుపేదలకు అండగా.. ఉండేలా మెనిఫెస్టో ఉండడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలను లెక్క వేయడంలో ఆగంకావొద్దన్నారు. తాండూరు అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
అనంతరం పలువురు జర్నలిస్టులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటామన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ ఇండ్లను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, శ్రీశైల్ రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లు పట్లోళ్ల నర్సింలు, డీవై నర్సింలు, మల్లారెడ్డి, అధ్యక్షులు నర్సిరెడ్డి, కోహీర్ శ్రీనివాస్ యాదవ్, రవిందర్ రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, సిద్రాల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి, శెట్టి రవిశంకర్, లింగేష్, వెంకటేశం(వాసు), భీంసేన్ రావు, రాంచందర్, పెరుమాళ్ల వెంకట్ రెడ్డి. డి. రామకృష్ణ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

మోగిన ఎలక్షన్ నగారా..!