ప్రభుత్వ స్థలాలను పరిరక్షించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించండి
– అక్రమణలు, కబ్జాల నుంచి కాపాడండి
– ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ సోమ శేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాలను పరిరక్షణకు దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని టీజేఎస్ ఇంచార్జ్, మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ కోరారు. శనివారం తాండూరు పట్టణంలోని 34వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వార్డు కౌన్సిలర్ సోమశేఖర్ వార్డు సమస్యలపై ఫిర్యాదు చేశారు. వార్డులోని డ్వాక్రా భవనం నిర్మాణాన్ని కొందరు కావాలని అడ్డుకున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వార్డులోని ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు.

ఈ ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా 40 ఏండ్లుగా తాండూరు పట్టణానికి తాగునీరు సరఫరా అందించిన కాగ్నా తాగునీటి సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. అంతేకాకుండా వార్డులో మిగిలి పోయిన మిషన్ భగీరథ తాగునీటి నల్లా కనెక్షన్లను పూర్తి చేయించాలని కోరారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జోక్యం చేసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం