రైతులకు శుభవార్త..!

జాతీయం తెలంగాణ

నెలాఖ‌రులోగా ప‌దో విడ‌త పీఎం కిసాన్ నిధులు
– రైతుల ఖాతాలో జ‌మ‌చేసేందుకు క‌స‌ర‌త్తు
ద‌ర్శిని బ్యూరో : మోదీ సర్కార్ రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు. ఈ స్కీమ్‌ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఏడాదికి మూడు విడతల్లో అంటే రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. ఇప్పుడు పదో విడత కింద రూ.2 వేలు అందనున్నాయి. ఇప్పటికే కేంద్రం 9 విడతల డబ్బును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన కేంద్రం.. ఇప్పుడు పదో విడత డబ్బులు అందించబోతుంది. అక్టోబర్ 31 వరకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రైతులకు అందనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తుందనే విషయం వెల్లడించలేదు.

కొత్త రైతులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
ఈ పథకంలో ఇంకా ఎవరైనా చేరకపోతే ఇప్పుడు కూడా చేరే అవకాశం క‌ల్పిస్తుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి నేరుగా ఆన్‌లైన్‌లోనే మీరు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. లేదా మీ సేవకు వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. గత కొంత కాలంగా వెబ్‌సైట్‌లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ పని చేస్తోంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పొలం పట్టా వంటి వివరాలతో స్కీమ్‌లో చేరితే డబ్బులు వస్తాయి.