రాటుదేలిన రియల్ వ్యాపారులు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రాటుదేలిన రియల్ వ్యాపారులు..!
– ప్రభుత్వ భూమిలో దర్జాగా పాగ
– అనుమతులు లేకుండా లేఅవుట్‌
– చర్యలకు బల్దియా, రెవెన్యూ శాఖల వెనుకడగు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు చెందిన కొందరు రియల్ వ్యాపారులు రాటుదేలిపోయారు. ప్రభుత్వ భూమినే పట్టాభూమిగా పేర్కొంటూ దర్జాగా పాగ వేశారు. అక్రమ లేఅవుట్‌ రూపొందించి ప్లాట్లు విక్రయించినా మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం ముందు.. పోలీస్టేషన్‌కు సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 130లోని 36 గుంటల భూమి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

గతంలో ఇక్కడ ఉన్న నివాసాలను కూల్చి వేసి కొందరు కబ్జాదారులు అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని తన్నుకుపోతున్నారని తాండూరుకు చెందిన సూరజ్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తాండూరు తహసీల్దార్ తారాసింగ్ విచారణ చేపట్టి సర్వేనెంబర్‌ 130లోని 36 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా తేల్చారు. కాని ఇప్పటి వరకు భూమిని స్వాదీనం చేసుకోలేదు. వివిధ కారణాలతో జాప్యం జరగడంతో కబ్జాలో ఉన్న రాటుదేలిన రియల్ వ్యాపారులు ఈ భూమి పట్టా భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు.

కొన్ని రోజుల ముందే అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లను కూడా విక్రయించారు. గజం రూ. 1లక్ష చొప్పున విక్రయించినట్లు సమాచారం. ఈ భూమి రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిజానికి భూమికి సంబంధించిన యజమానులు దశాబ్దాల క్రితమే పాకిస్థాన్‌కు వెళ్లడంతో దాని పక్కనే ఉన్న పట్టాదారులు వారి ఆదీనంలోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

అటు భూమిలో కబ్జా దారులు బోర్డులు ఏర్పాటు చేసినా రెవెన్యూ అధికారులు భూమిని స్వాదీనం చేసుకోవడంలో ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

https://www.dharshininews.com/29118/