కంటి పాపలు ఇక సేఫ్..!
– జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి వైద్య సేవలు
– పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో పరీక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నెలలు నిండకుండా పుట్టిన శిశులతో పాటు బరువు తక్కువగా ఉన్న పసికందుల్లో కంటి సమస్యలు రాకుండా తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భరోసానందించే వైద్య సేవలను అందుబాటులోకి తీసుకవచ్చారు. సికింద్రాబాద్‌లోని పుష్పగిరి కంటి ఆసుపత్రి ద్వార జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇక్కడి నవజాత శిశు సంజీవనీ కేంద్రంలో చిన్నారులకు రెటీనా, ఆర్వోపీ సమస్యలకు చికిత్సలు అందిస్తున్నారు. అంధత్వ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ సహాకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో ఈ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకవచ్చారు.
ఇక్కడే ఎందుకంటే..
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలలు నిండకుండా, బరువు తక్కువగా ఉండి శిశువులపై ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 8 ప్రాంతాలను గుర్తించింది. ఇందులో తాండూరు ప్రాంతం కూడ ఉండడంతో జిల్లా ఆసుపత్రిలో శిశువులకు కంటి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. శిశువుల్లో అంధత్వ నియంత్రణకు పుష్పగిరి కంటి ఆసుపత్రి అనుసంధానంతో పరీక్షలను చేస్తున్నారు.
పర్యవేక్షిస్తున్న పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు
తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకవచ్చిన శిశువులకు కంటి వైద్య సేవలను పుష్పగిరి కంటి ఆసుప్రతి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాల విద్యాధర్, డాక్టర్ విషాల్‌లు నవజాత శిశు సంజీవని కేంద్రంలోని చిన్నారులకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కెమరాతో ఆర్వోపీ, రెటీనా పరీక్షలను చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కూడ వారు ఆసుపత్రిని సందర్శించి చిన్నారుల కంటి వైద్య సేవలను పరిశీలించారు. 34 వారాలు ఉన్న శిశువులతో పాటు బరువు తక్కువగా ఉన్న శిశువులకు పరీక్షలు జరిపారు.
సిబ్బందికి శిక్షణ
జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన వైద్య సేవలను నిరంతరం కొనసాగించేందుకు వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు ఎలా పరీక్షలు నిర్వహించాలి..? కెమెరా ఎలా స్ర్కీనింగ్ చేయాలనే దానిపై తర్పీదు ఇస్తున్నారు. ప్రతిరోజూ వైద్యుడే పరీక్షలు చేయాల్సిన పనిలేదని, ఈ వైద్య సేవల్లో సిబ్బందికి నైపుణ్యత కల్పిస్తే వైద్య సేవలందించవచ్చని పుష్పగిరి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చినా ప్రతినెల 15 రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తామని తెలిపారు.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ రవిశంకర్, ఆసుపత్రి సూపండెంట్
ఆసుపత్రిలో ప్రసవించిన శిశువులతో పాటు బరువు తక్కువగా ఉన్న శిశువులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. కంటి సమస్యలను గుర్తించిన చిన్నారులకు 30 రోజుల వరకు వైద్యసేవలను అందించడం జరుగుతుంది. చిన్నారుల్లో ఆంధత్వ నియంత్రణ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసువచ్చిన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.