ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ప‌రిష్క‌రించాలి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

– ప్ర‌తి సోమ‌వారం డ‌య‌ల్ ఇన్ గ్రీవెన్స్
– సీజ‌న‌ల్ వ్యాధుల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించాలి
– వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ పౌసుమి బ‌సు
– జిల్లా క‌లెక్ట‌రేట్‌లో డ‌య‌ల్ ఇన్ గ్రీవెన్స్
ద‌ర్శిని బ్యూరో, వికారాబాద్ : అధికారులు త‌మ ప‌రిధిలో ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించాల‌ని వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ పౌసుమి బ‌సు సూచించారు. సోమ‌వారం వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ పౌసుమి బ‌సు అధ్య‌క్ష‌త‌న డ‌య‌ల్ ఇన్ గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గ‌తంలో నిర్వ‌హించిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా నిలిపివేశారు. తాజాగా జిల్లా క‌లెక్ట‌ర్ పౌసుమి బ‌సు డ‌య‌ల్ ఇన్ గ్రీవెన్స్ కార్య‌క్ర‌మం పేరుతో పున‌రుద్ద‌రించారు. ప్ర‌జ‌లు కార్యాల‌యానికి రాకుండా ఫోన్‌లో మాత్ర‌మే స‌మ‌స్య‌లు స్వీక‌రించేందుకు టోల్ ఫ్ర్రీ నెంబ‌ర్ 08416-256989ను ఏర్పాటు చేశారు. సోమ‌వారం జిల్లా స్థాయితో పాటు మండ‌ల స్థాయి అధికారులో డ‌య‌ల్ ఇన్ గ్రీవెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్ ప‌లు స‌మ‌స్య‌ల‌ను స్వీక‌రించారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం అధికారులందరు ఉదయం 9:30 గంటలకు డయాల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొనాల‌న్నారు. శాఖల వారిగా వచ్చే సమస్యలను పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో అధికారులు బాగా పని చేసి అక్కడి కాక్కడే సమస్యలు పరిష్కరిస్తే, ప్రజలు ఇక్కడి వరకు రారని సూచించారు. జిల్లాలో డెంగీ, మలేరియా తదితర సీజనబుల్ వ్యాధులు పెరుగకుండ అన్ని గ్రామాలలో ప్రతి రోజు పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. మ‌రోవైపు సోమ‌వారం ఉద‌యం చేప‌ట్టిన డ‌య‌ల్ ఇన్ గ్రీవెన్స్‌లో మొత్తం 13 స‌మ‌స్య‌లపై ఫిర్యాదులు వ‌చ్చాయి. పెండింగ్ మ్యుటేషన్స్, డీఎస్‌ పెండింగ్, భూ సమస్యలు, రైతు బంధు సమస్యల‌పై వ‌చ్చిన ఫిర్యాదుల‌ను సంబంధిత అధికారులు ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య లతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.