చోరీలపై ఉక్కుపాదమేయండి..!
– రాత్రి, పగలు గస్తీ పెంచండి
– ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– దొంగతనాల కుటుంబాలకు పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరుగుతున్న చోరీలపై ఉక్కుపాదం మోపే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం సాయిపూర్, పాత తాండూరులో రెండు ఇండ్లలో దొంగతనాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మల్యే మనోహర్ రెడ్డి ఆదివారం సాయంత్రం సాయిపూర్‌లోని పట్లోళ్ల వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కుటుంబీకులను పరామర్శించారు. అదేవిధంగా పాత తాండూరులోని విలేకరి బస్వరాజ్ గౌడ్ ఇంటికి కూడా వెళ్లి పరామర్శించారు.
అనంతరం పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై రమేష్‌లతో కలిసి రెండు ఇండ్లలో చోరి జరిగిన విధానాలను అడిగితెలుసుకున్నారు. ఆధారాల సేకరణ, విచారణ గురించి ఆరా తీశారు. పట్టణంలో జరగుతున్న చోరీలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి, పగలు కూడా పోలీసు శాఖ నుంచి విధిగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి చోరీలు జరగకుండా ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా తమ ఇండ్లలో చోరీలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాండూరులో జరిగిన చోరి బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ద్వారా వెంటనే నిందితులను గుర్తించి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ జిల్లా వైస్ రవీందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

