చోరీలపై జరభద్రం..!
– పోలీసుల మైక్ అనౌన్స్ మెంట్
– అనుమానితుల ఫోటోలు విడుదల
– అప్రమత్తంగా ఉండాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : చోరీల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని తాండూరు పోలీసులు సూచిస్తున్నారు. శనివారం తాండూరులో వరుస చోరీలు జరిగిన నేపథ్యంలో పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. శనివారం రాత్రి నుంచే తాండూరు పట్టణంలో పట్టణ వాసులకు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఆటోలో పట్టణంలోని పలు ప్రాంతాలలో మైక్ అనౌన్స్ మెంట్ చేయించారు. తాళాలు వేసిన ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళితే పక్కింటి వాళ్లకు తెలపాలన్నారు. ఇంటి తాళం కప్పులను బలమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వాహనాలను కూడా ఇంటి ఆవరణలో పార్కు చేసుకుని చక్రాలకు చైన్లతో తాళాలు వేసుకోవాలన్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలలో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. మరోవైపు తాండూరులో సంచరిస్తున్న అనుమానిత దొంగల ఫోటోలను విడుదల చేశారు. ఈ వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సెల్: 8712670049కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తాండూరు పట్టణంలోని శివారు ప్రాంతాలలో పర్యటిస్తూ తాళం వేసిన ఇండ్లపై రిక్కి చేసి టార్గెట్ ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. చోరీలు జరగకుండా అందరు భద్రంగా ఉండాలన్నారు.
ఇదికూడా చదవండి…

