– ఎన్ఐసీ ద్వారా పోలీసులకు అవగాహన
– పకడ్బందీగా నమోదు చేయాలి: సీఐ రాజేందర్‌రెడ్డి
దర్శిని ప్రతినిధి, తాండూరు: ఐరాడ్ వ్యవస్థతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాద్యపడే అవకాశం ఉందని నేషనల్ ఇన్ఫోర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ) ప్రతినిధి నెహ్రు అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్‌లో తాండూరు సబ్ డివిజన్‌లోని తాండూరు పట్టణ, కరణ్‌కోట్, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ పోలీస్టేషన్‌ల ఎస్‌హెచ్ఓలు, ఈకాప్స్ రైటర్స్‌కి జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్ ఆదేశాల మేరకు ఐరాడ్(ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ డాటాబేస్ అప్లికేషన్‌పై అవగాహన కల్పించారు. నేషనల్ ఇన్ఫోర్మేటిక్ సెంటర్ ప్రతినిధి నెహ్రు ఐరాడ్ వ్యవస్థపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, దానిని ఎలా ఉపయోగించాలి అనే దానిపై క్షుణ్ణంగా వివరించారు.
ఈ అప్లికేషన్ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా నివారించాలి అని, అందుకు గల కారణాలు ఏంటి, ఆ రోడ్డు ప్రమాదానికి కారణం ఏంటి, వాహనదారుల నిర్లక్ష్యమేమైనా ఉందా, అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు క్షుణ్ణంగా విశ్లేషించడం జరగుతుందని తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు ఏలాంటి చర్యలు తీసుకోవాలి అనే తగిన సమాచారం క్షణాలలో పొందడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ కు సంబంధించిన సమాచారాన్ని జాతీయస్థాయిలో సమకూర్చి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన కార్యక్రమాలు చేపట్టేందుకు ఐరాడ్ వ్యవస్థ దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఐరాడ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా డాటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ గిరి, కరణ్‌కోట్ ఎస్ఐ ఏడుకొండలు, యాలాల ఎస్ఐ సురేష్, ఆయా పోలీస్ స్టేషన్‌ల ఈ కాప్స్ రైటర్స్ పాల్గొన్నారు.

