పత్తి రైతులను పల్టీ వేసే ప్లాన్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పత్తి రైతులను పల్టీ వేసే ప్లాన్..!
– ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ విత్తనాల విక్రయాలు
– సీజన్ కు ముందే ఎగనామంకు పన్నాగం
– టాస్క్ ఫోర్స్, పోలీసుల దాడులతో గుట్టురట్టు
– యాలాలలో ఇద్దరు విక్రయేతరుల అరెస్టు, మరొకరి పరార్
– వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
తాండూరు,దర్శిని ప్రతినిధి : సీజన్ రాకముందే పత్తి రైతులను పల్టీ వేసేందుకు నకిలీ విత్తనాలు విక్రయించేందుకు వ్యాపారులు వేసుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది. జిల్లా టాస్క్ ఫోర్స్, పోలీసులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో చేసిన ఆపరేషన్ ద్వారా నకిలీ విత్తనాల వ్యాపారుల గుట్టు రట్టయ్యింది. మొత్తం ముగ్గురు వ్యాపారుల్లో ఇద్దరు పట్టుబడగా, మరో వ్యాపారి పరారయ్యాడు. ఈ ఆపరేషన్ ద్వారా రూ. 44లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ఈ ఆపరేషన్ పకడ్బందీ జరిగింది. తాండూరు డీఎస్పీ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి స్థానిక డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కురచాల కోటకు చెందిన నన్నపనేని శివ నాగేశ్వర్ రావు, కొత్తకోటకు చెందిన ఎం. నారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా దాసరి శ్రీనివాస్ రావులు గత పదేళ్లుగా కర్ణాటక రాష్ట్రం కురిపల్లిలో ఉంటూ నకిలీ విత్తనాల వ్యాపారం గుట్టుగా సాగిస్తున్నారు. పత్తి పంట సాగు సీజన్ లో రైతులకు విత్తనాలు అమ్మకాలు చేస్తే అధికారులు పట్టుకుంటారని.. సీజన్ కు రెండు నెలల ముందే అమ్మకాలు చేస్తే ఎవ్వరికి అనుమానం రాదని ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు శనివారం యాలాల మండలం బాగాయిపల్లి చౌరస్తాకు కొద్ది దూరంలో ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు తెచ్చారు. అప్పటికే విశ్వననీయ సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ ఇను స్పెక్టర్ అన్వర్ పాష, తాండూరు రూరల్ సీఐ వై.నగేష్ లు టాస్క్ ఫోర్స్ బృందం, యాలాల పోలీసులు, వ్యవసాయ శాఖ ఏఈఓ ఎ. శ్వేతల బృందం వీరిని పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు.

బాగాయి పల్లి చౌరస్తా సమీపంలో ఈ ముగ్గురు అనుమానాస్పద కనిపించడంతో పట్టుకునేందుకు వెళ్లారు. అది గమనించిన నారాయణ రెడ్డి పారిపోగా మిగతా ఇద్దరు నన్నపనేని శివనాగేశ్వర్ రావు, దాసరి శ్రీనివాస్ రావు లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ప్లాస్టిక్ సంచులలో ఉన్న విత్తనాలకు ఎలాంటి లేబుళ్లు, లాట్, బ్యాచ్, డేట్ లేకపోవడంతో యాలాల వ్యవసాయ శాఖ అధికారిణి శ్వేత నకిలీ విత్తనాలుగా నిర్ధారించారు. రూ.44 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, పరారిలో ఉన్న నిందితున్న కూడా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైతులు నకిలి విత్తనాలపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అపరిచిత వ్యక్తుల వద్ద గానీ, డీలర్ల వద్ద గాని విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో లేబుల్, లాట్, తయారీ తేది, గడువు వంటి వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయాలు చేపడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎస్ఐ గిరన్న, టాస్క్ ఫోర్స్, పోలీసుల బృందం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

జిల్లా ఆసుపత్రికి చేయూత