తేలిన ఎమ్మెల్సీ ఓటర్ల లెక్క
– ఉమ్మడి రంగారెడ్డిలో 1302 మంది గుర్తింపు
రంగారెడ్డి, దర్శిని ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఖాళీలు ఏర్పడుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చక చకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉంటారని ఎన్నికల సంఘాలు స్పష్టం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లను అధికారులు గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1302 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ఈనెల 15న ప్రచురించబోతున్నారు. 20వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించి 21, 22 వ తేదిలలో పరిశీలన జరిపి.. 23న తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే గుర్తించిన ఓటర్లలో 32 మంది జెడ్పీటీసీ సభ్యులు, 370 మంది ఎంపీటీసీ సభ్యులు, 277 మంది కార్పోరేటర్లు, 466 మంది కౌన్సిలర్లు, 157 మంది కోఆప్షన్ సభ్యులు ఉన్నారు.
16న ఎన్నికల నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో 9వ తేది నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈనెల 16న నోటీఫికేషన్ విడుదల చేసి 23వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలిన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.