అధిక చార్జీలు ఎందుకు..!
– గ్యాస్ ఏజేన్సి సిబ్బందిని నిలదీత
– కరణ్‌కోట్‌లో వినియోగదారుల ఆందోళన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అధిక చార్జీలు ఎందుకు చెల్లించాలని గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఏజెన్సి సిబ్బందిని నిలదీశారు. ఆదివారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో వినియోగదారులు ఆందోళనకు దిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వినియోగదారులు అధిక చార్జీల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో సిలిండర్ ధర రూ. 970లు ఉండగా ఏజెన్సీ సిబ్బంది దానికి అదనంగా చార్జీలు వసూలు చేయడంపై మండిపడ్డారు. దీనిపై తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనికి తహసీల్దార్ స్పందిస్తూ నిబంధనలకు విరుద్దంగా అధిక చార్జీల వసూళ్లకు పాల్పడితే ఏజెన్సీసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు అన్నిస్టాంపు పత్రాలతో చార్జీలను వసూలు చేయాలని, లేదంటే ఏజెన్సీపై చర్యలు తీసుకునేలా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు గత కొన్ని రోజుల క్రితం మల్కాపూర్ గ్రామంలో కూడ అధిక చార్జీలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచడంపై వినియోగదారులు ఆందోళనలు చేపడుతున్నారు.
