రోడ్డెక్కిన మిషన్ భగీరథ నీరు..!
– తక్షణ చర్యలు తీసుకున్న ఆర్టీఓ అశోక్ కుమార్
– రోడ్డుపై నీటిపారుదలతో ప్రజలు ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో మిషన్ భగీరథ తాగునీరు రోడ్లపై వృథాగా పారింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్, తాండూరు, ఆర్డీఓ అశోక్ కుమార్ వెంటనే కట్టడి చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ పాత కార్యాలయం వెనుకభాగంలో మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ పనులు కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం మున్సిపల్ ట్యాంకు నుంచి నీరు సరఫరా అయ్యే పైపులైన్ ప్రమాద వశాత్తు ధ్వంసం అయ్యింది.
దీంతో ఒక్కసారిగా మిషన్ భగీరథ నీరంతా భారీ ఉధృతితో ప్రవహించింది. నీరంతా.. కార్యాలయం వెనుభాగం, పక్క నుంచి వరదలా ప్రవహించింది. రోడ్లపై నీరు పారడంతో మున్సిపల్ ముందు చిరు వ్యాపారులు, శాంత్ మహాల్ కాంప్లెక్స్ లోని దుకాణాలలో నీరంతా ప్రవహించడంతో ఇబ్బందులు పడ్డారు.
విషయం తెలుసుకున్న ఆర్డీఓ అశోక్ కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మిషన్ భగీరథ అధికారులను రప్పించి నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేలా చర్యలు తీసుకున్నారు. మరోసారి నీటి వృధాకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.
