ఈసారి నోఆప్షనే..?
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోఆప్షన్ ఓటు కట్
ఉమ్మడి రంగారెడ్డి, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిన్న, మొన్నటి వరకు కోఆప్షన్ సభ్యుల్లో జోష్‌ను పెంచాయి. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందని ఆశపడిన కోఆప్షన్‌లు అధికారులు చేసిన ఓ ప్రకటనతో నిరాశ చెందుతున్నారు. ఎన్నికల్లో ఎన్నికల్లో కోఆప్షన్‌లకు నో.. అఫ్షన్ అంటూ ఎన్నికల అధికారులు సంకేతాలు పంపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈనెల 9న షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించబడిన అమోయ్ కుమార్ ఎన్నికల ఏర్పాట్లను చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. ఉమ్మడి జిల్లాలోని జెడ్పీ చైర్ పర్సన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లతో పాటు కోఆప్షన్ సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో 32 మంది జెడ్పీటీసీలు, 370 మంది ఎంపీటీసీలు, 277 మంది కార్పోరేటర్లు, 466 మంది మున్సిపల్ కౌన్సిలర్లుతో పాటు 157 మంది కోఆప్షన్ సభ్యులతో మొత్తం 1302 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాను సిద్దం చేశారు. సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేసిన జాబితాలో కోఆప్షన్‌లకు సంబంధించి వివరాలను వెల్లడించలేదు. దీంతో జిల్లాలోని కోఆప్షన్ సభ్యులు అయోమయానికి గురయ్యారు. క్రితం సారి కూడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారని ఆశపడ్డారు. ఈ సారి కూడ ఆశ చూపించి.. ఆప్షన్ లేదనే సంకేతాలు రావడంతో కోఆప్షన్ సభ్యులు నిరాశలోకి జారుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోఆప్షన్ సభ్యులకు ఓటు హక్కును కల్పించలేదనే ఉద్దేశంతో జాబితాలో అవకాశం కల్పించలేదని స్పష్టమవుతోంది.
కొత్త ఓటర్లు వీళ్లే..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు కొత్త ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1179 మంది ఓటర్లు ఉన్నట్లు, ఇందులో 33 మంది జట్పిటిసిలు, 384 మంది ఎంపిటిసిలు, 432 మంది కౌన్సిలర్లు, 310 మంది కార్పోరేటర్లు, 20 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నట్లు అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రదర్శించారు. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఈనెల 20 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 23న తుది జాబితాను ప్రకటించనున్నారు.