వడ్ల దొంగలు..!
– ప్రభుత్వ వడ్లు పక్కదారి
– రూ. 6కోట్ల 38లక్షల ధాన్యం మాయం
– రైస్ మిల్ యజమానికి లీజుదారులు టోకరా
– బాధితుడి ఫిర్యాదుతో నిందితులపై కేసు
– ఇద్దరిని రిమాండుకు తరలించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వానికి దక్కాల్సిన వడ్లను ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్కు తరలించి కోట్ల రూపాయిలు కాజేశారు. రైస్ మిల్ యజమానికి నోటీసులు రావడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండుకు తరలించారు. బుధవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. తాండూరుకు చెందిన రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యాలాల మండలం చెన్నారం గ్రామ పరిధి సర్వేనెంబర్ 81/1లో కృష్ణసాయి రైస్ మిల్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేశారు. అయితే రైస్ మిల్ నడపడంలో అనుభవం లేని రవీందర్ గౌడ్ 2022 సంవత్సరంలో తాండూరుకు చెందిన అవిటి సంతోష్ కుమార్, చల్లా వెంకటేష్‌తో పాటు సంతోష్ కుమార్ భార్య శ్వేతతో కలిసి రైస్ మిల్ లీజుకు తీసుకున్నారు.

అప్పటి నుంచి వారే రైస్ మిల్ నడిపిస్తున్నారు. అయితే 2022-23 యేడాదిలో రబీ, ఖరీఫ్ సీజనకు సంబంధించి 142 క్వింటాళ్ల వడ్లు, 2023-24 యేడాదిలో రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించి 17,265 ధాన్యం మొత్తం 17,408 క్వింటాళ్ల ప్రభుత్వ వడ్లను పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించిన ధాన్యంతో సొమ్ము చేసుకున్నారు. రైస్ మిల్లో జరిగిన కార్యకలాపాల విషయంలో రూ. 6 కోట్ల 38 లక్షల 51 వేల డిమాండ్ నోటీసును సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్ యజమానికి పంపించారు. దీంతో రవీందర్ గౌడ్ సంతోష్ కుమార్, చల్లా వెంకటేశంలను నిలదీశారు. ఇందుకు వారు తప్పును అంగీకరించి రూ. 5కోట్ల 10లక్షలు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. ఇందుకోసం సంతోష్ కుమార్ తన పేరుతో పాటు ఆయన భార్య పేరు శ్వేత పేరుతో, చల్లా వెంకటేశం పేరుతో మూడు చెక్కులు రవీందర్ గౌడ్ కు ఇచ్చారు. ఈ చెక్కులను హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో వేయగా చెక్కులు బౌన్స్ అయ్యాయి. సంతోష్ కుమార్ అతని భార్య పేరుతో ఇచ్చిన చెక్కును ఫోర్జరీ చేసి అందించినట్లు గుర్తించారు. రవీందర్ గౌడ్ ను మోసం చేస్తున్నారని గమనించి యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులు అయిన సంతోష్ కుమార్, చల్లా వెంకటేష్ లపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

