మున్సిపల్ వార్డులకు మహర్ధశ
– ఒక్కో వార్డుకు రూ. 30 లక్షల వరకు నిధులు
– ఎమ్మెల్యే గల్లీ గల్లీకి పైలెట్ ద్వారా రూ.10 కోట్లు
– నేటి కౌన్సిల్ సమావేశంలో ఆమోదానికి అవకాశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లోని వార్డులకు మహర్ధశ వరించబోతుంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ‘గల్లీగల్లీకి పైలెట్’ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డుకు నిధులు మంజూరయ్యాయి. వార్డుకు దాదాపు రూ. 30లక్షల చొప్పున నిధులు కేటాయించబోతున్నారు. గత యేడాది ఆగస్టు నెలలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరులోని 36 వార్డులలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గల్లీగల్లీకి పైలెట్ పేరుతో స్థానిక కౌన్సిలర్లతో కలిసి పాదయాత్రలు చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. వీటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత కనబరిచారు. ఇందులో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో 15వ ఆర్థిక సంఘం నుంచి వార్డులకు నిధులను కేటాయించారు. తాండూరు మునిసిపాలిటీలోని మొత్తం 36 వార్డులకు రూ.10 కోట్ల మేరకు నిధులను మంజూరు చేశారు. ఒక్కో వార్డుకు రూ.30 లక్షల వరకు నిధులను కేటాయించారు. నేడు శనివారం నిర్వహిస్తున్న మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిధుల ఖర్చుకు పరిపాలన ఆమోదం లభించనుంది. ఒకేసారి ఒక్కో వార్డుకు రూ.30 లక్షలు కేటాయించడంపై మునిసిపల్ కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిధులను కేటాయించడంతో అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.10 కోట్ల నిధులకు పరిపాలన ఆమోదం పొందిన వెంటనే టెండర్లను పూర్తి చేసి పనులను ప్రారంభించాలని యోచిస్తున్నారు. దీంతో తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డులలో సమస్యలు తొలిగి మహర్ధశ పట్టబోతోంది.

